Supari | లక్నో : హత్య చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయలేదని ఓ కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో గత ఏడాది జరిగిన హత్యకు సంబంధించిన కేసును పోలీసులు తిరిగి తెరిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న న్యాయవాది అంజలి గార్గ్‌ను హత్య చేయడానికి నీరజ్ శర్మ అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో కొందరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను హత్య చేస్తే రూ.20 లక్షలు ఇస్తామని చెప్పారు. ముందుగా రూ.1 లక్ష చెల్లించారు.
అంజలిని 2023 జూన్ 7న ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. మాజీ భర్త పేరు మీద ఉన్న ఇంట్లో ఆమె నివసించేవారు. ఆ ఇంటిని యశ్పాల్, సురేశ్‌లకు అతని బంధువులు అమ్మేసినప్పటికీ ఆమె ఖాళీ చేయడానికి తిరస్కరించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. పోలీసులు మృతురాలి మాజీ భర్త, అతని బంధువులను కస్టడీలోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటిని కొన్నవారే అంజలిని హత్య చేయడానికి నీరజ్ శర్మ, మరో ఇద్దరితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. వెంటనే పోలీసులు శర్మతోపాటు ఇద్దరు హంతకులను, యశ్పాల్, సురేశ్‌లను అరెస్ట్ చేశారు. శర్మ ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు. తనకు మిగిలిన రూ.19 లక్షలు ఇవ్వాలని యశ్పాల్, సురేశ్‌లను శర్మ కోరాడు. వారు అందుకు తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంజలి హత్యలో ఆమె మాజీ భర్త, అతని బంధువుల పాత్ర కూడా ఉందని చెప్పాడు. తన వాదనకు మద్దతుగా కాల్ రికార్డులను కూడా సమర్పించాడు. దీంతో పోలీసులు కేసును తిరిగి తెరిచారు.