న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన ఒక నిర్మాణ సంస్థకు ప్రభుత్వం కోటి జరిమానా విధించింది. నిర్మాణ పనులు జరుగుతున్న స్థలం మూసివేతకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం ఆదేశించారు. శీతాకాలం నేపథ్యంలో కాలుష్యం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు తగ్గుతున్నాయి. ఈ అంశంపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టింది. కాలుష్య నివారణకు సంబంధించిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది.
కాగా, ఢిల్లీ నేతాజీ నగర్లోని ఎన్బీసీసీ ఇండియా సంస్థకు చెందిన నిర్మాణ సైట్లో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకం పనులు చేపట్టారు. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ దీనిపై స్పందించారు. కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన ఎన్బీసీసీ ఇండియా నిర్మాణ సంస్థకు కోటి జరిమానా విధించాలని అధికారులకు చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు విధించిన కాలుష్య నిబంధనలకు వ్యతిరేకంగా రాత్రిపూట పనులు చేస్తున్న ఆ సంస్థ నిర్మాణ సైట్కు సీలు వేయాలని ఆదేశించారు.