న్యూఢిల్లీ, జూన్ 14: వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరించే సజీవ, సహజ, పరిణామ పత్రంగా భారతీయ రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అభివర్ణించారు. ఎడిన్బర్గ్ లా స్కూలులో పరిణామ పత్రంగా రాజ్యాంగం అనే అంశంపై సీజేఐ ప్రసంగిస్తూ మారుతున్న కాలంలో వచ్చిన సవాళ్లను ఎదుర్కొనడానికి గడచిన 75 ఏండ్లలో అనేక సవరణలను భారత రాజ్యాంగం వీక్షించిందన్నారు.
వివి ధ సందర్భాలలో రాజ్యాంగంపై సుప్రీంకోర్టు ఇచ్చే వివరణ కారణంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు పార్లమెంట్ సకాలంలో స్పందించి పార్లమెంట్లో రాజ్యాంగానికి సవరణలు తీసుకురావడం ద్వారా సమాధానాలు ఇచ్చిందని తెలిపారు. కొత్త తరాలకు చెందిన మార్పులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు అవసరమవుతాయని చెప్పారు.