Nida Khan : టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ తల్లిదండ్రులు ఈ అంశంపై స్పందించారు. తమ కూతురుకు దీనితో ఏ సంబంధం లేదని, ఆమెపై ఆరోపణలు అన్నీ అబద్ధాలే అని ఖండించారు. అంతేకాదు.. నాసిక్‌లోని కొందరిని కాపాడేందుకు తమ కూతురును ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై నిదాఖాన్ తల్లిదండ్రులు, బంధువులు మీడియాతో మాట్లాడారు.
‘‘నిదాఖాన్‌పై ఆరోపణలు అన్నీ అవాస్తవాలు. మరొకరిపై ఒత్తిడి తెచ్చేందుకు మా కూతురును లక్ష్యంగా చేసుకున్నారు. నిదాపై ఆరోపణలు చేసిన వ్యక్తితో ఆమె ఇప్పటిదాకా కనీసం మాట్లాడలేదు. నిదా ప్రస్తుతం భీవండిలోని అత్తవారింట్లో ఉంటోంది. ఆమె ప్రస్తుతం గర్భిణి. ఆమెపై ఆరోపణలతో మా కుటుంబమంతా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. ఖారత్ కేసు, ఇతర కేసుల్ని తప్పుదోవ పట్టించేందుకు నిదాఖాన్‌పై కుట్ర చేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగం. ఇప్పటివరకు మతం మారాలని నిదా ఎవరినీ కోరలేదు. ఇతర దేవుళ్లు, దేవతలపై కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు’’ అని ఆమె తల్లిదండ్రులు అన్నారు. తాము పేద కుటుంబానికి చెందినవారమని, తమ కుటుంబానికి అండగా నిలవడం కోసం ఆమె పని చేస్తోందన్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని తెలిపారు. టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడటం, బలవంతపు మత మార్పిడుల అంశంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అక్కడి సీనియర్ ముస్లిం ఉద్యోగుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. అదే సంస్థలో హెచ్ఆర్గా ఉన్న నిదా ఖాన్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉంది. ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె గర్భిణి అని, విచారణ నుంచి ఆమెకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆమె కుటుంబం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు నిదాఖాన్ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఉద్యోగుల్ని టీసీఎస్ సస్పెండ్ చేసింది.