ప్రయాగ్రాజ్, సెప్టెంబర్ 14: నాలుగేండ్ల పాటు ఇష్టపూర్వక శారీరక సంబంధం కొనసాగిన తర్వాత పెండ్లికి నిరాకరించడం విచారణకు అర్హమైన కేసు కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. తనపై లైంగిక దాడి చేశాడంటూ ఆరోపిస్తూ ఒక మహిళ తన సహజీవన భాగస్వామిపై దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ‘మా దృష్టిలో ఇద్దరు తెలివైన వయోజనులు రెండేండ్లకు పైగా సహజీవనం చేస్తూ ఉన్నారంటే, దాని పరిణామాల పట్ల వారికి పూర్తిగా అవగాహన ఉన్నట్టే మేము భావిస్తున్నాం’ అని జస్టిస్ అరుణ్ కుమార్ సింగ్ దేశ్వాల్ తెలిపారు.
అందువల్ల వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వడం వల్లే అలాంటి సంబంధం ఏర్పడిందనే ఆరోపణ ప్రస్తుత పరిస్థితులలో అంగీకారానికి అనర్హమైనదని, ప్రత్యేకించి వివాహం చేసుకుంటానని హామీ ఇవ్వకపోతే అలాంటి సంబంధం ఏర్పడేది కాదని అనడం సహేతుకంగా లేదని పేర్కొన్నారు. కాగా, తన ఫిర్యాదును 2024, అగస్టులో కొట్టివేస్తూ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా, కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.