బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను (Siddaramaiah) మరో వివాదం చుట్టుముట్టింది. చేతిలో జాతీయ జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సిద్ధరామయ్య బూట్లు విప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి నివాళి అర్పించే ముందు కాళ్లకు ఉన్న బూట్లు విప్పేందుకు ప్రయత్నించారు. ఆయన ఒంగలేకపోవడంతో చేతిలో చిన్న త్రివర్ణ పతాకం పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్త ఒకరు సిద్ధరామయ్య బూట్లు విప్పాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తి చేతి నుంచి ఆ జెండా తీసుకున్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ కూడా మండిపడింది. బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఈ సంఘటనపై స్పందించారు. ‘ఇది జాతి గౌరవానికి అవమానం. ఇదీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్కృతి. వారు క్షమాపణ చెప్పాలి’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
It’s insult to Nation’s pride,this is the culture of Congress party leaders, they must apologise to the Nation
— Ponguleti Sudhakar Reddy (Modi Ka Parivar) (@ReddySudhakar21) October 2, 2024