Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) పార్టీ విజయమే తనకు ప్రజలు ఇచ్చిన ఉత్తమ పుట్టినరోజు కానుక అని కేపీసీసీ చీఫ్ (KPCC Chief) డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. సోమవారం ఆయన తన 62వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. మే 10వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయమే తనకు ప్రజలు ఇచ్చిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని అన్నారు.
‘నా పుట్టినరోజు సందర్భంగా.. కర్ణాటక ప్రజలు నాకు ఉత్తమమైన పుట్టినరోజు కానుకను ఇచ్చారు. నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు నా కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు. కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికి నా జీవితం అంకితం’ అని అన్నారు.
మరోవైపు కర్ణాటకలో నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నేత ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కన్నడనాట పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), శివకుమార్ (DK Shivakumar) ఇప్పుడు సీఎం పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ నేతలిద్దరూ తమ మద్దతుదారులతో సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ తనకు ఇస్తే సీఎం పదవి ఇవ్వండి, లేదంటే వదిలేయండి అని చెప్పినట్టు సమాచారం. సీఎం పదవి కాకుండా క్యాబినెట్లో ఏ పదవీ తనకు వద్దని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం సిద్ధరామయ్య హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 224 స్థానాలకు గానూ ఏకంగా 135 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.