Bengaluru | బెంగళూరు: బెంగళూరు వాసులకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మరో షాక్ ఇవ్వనుంది. విద్యుత్తు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(కేఈఆర్సీ)కి బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ(బెస్కామ్) ప్రతిపాదనలు పంపించింది. మూడు దశల్లో విద్యుత్తు చార్జీలు పెంచాలని బెస్కామ్ నిర్ణయించింది.
2025-26లో యూనిట్‌కు 67 పైసలు, 2026-27లో యూనిట్‌కు 74 పైసలు, 2027-28లో యూనిట్‌కు 91 పైసల చొప్పున పెంచేందుకు అనుమతించాల్సిందిగా కేఈఆర్సీని కోరింది. ఇలాంటి ప్రతిపాదననే ఇంతకుముందు చేయగా కేఈఆర్సీ తిరస్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్తు చార్జీలు పెంచడం ఇది రెండోసారి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే చార్జీలు పెంచింది. కాగా, గ్యారెంటీలతో ఖాళీ అవుతున్న ఖజానాను నింపేందుకు ఇప్పటికే పాలు, స్టాంప్ డ్యూటీ, పెట్రోల్, మద్యం ధరలను సైతం ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.