న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తనను దూషించే బాధ్యతను కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ పార్టీ అప్కి ఇచ్చిందని మోదీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రధాని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, మోదీని ఓ అబద్దాల కోరుగా కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేష్ అభివర్ణించారు. మోదీ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే మాట్లాడతారని అన్నారు. తాము ఎవరినీ దూషించమని, ప్రధాని నోటి నుంచి వచ్చే మోసపు మాటలనే తాము లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఈ అబద్దాల కోరు బండారం బయటపెట్టేందుకు అలాంటి లక్షణాలున్న మరొకరిని ఎందుకు ఎంచుకుంటామని ప్రశ్నించారు.
కాగా రాజ్కోట్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా తనను దూషిస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అనూహ్యంగా మౌనం దాల్చిందని, తనను తిట్టే పనిని ఇతరులకు అప్పగించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో ఓట్ల వేటకు దిగిందని ఆ పార్టీ పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పేర్కొన్నారు.