Congress | బెంగళూరు: మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన బెల్గాం సెషన్ వందో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెళగావిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశం తీవ్ర దుమారానికి కారణమైంది. సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారత పటం బ్యానర్లలో జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు కనిపించకుండా పోయాయి. ఈ ఫొటోల బ్యానర్లను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన బీజేపీ.. కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసింది. ఈ ఘటనను ‘సిగ్గుచేటు’గా అభివర్ణించింది.
దేశాన్ని అస్థిరపరిచేందుకు యూఎస్ బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించింది. కాంగ్రెస్ తన బెళగావి సమావేశంలో వక్రీకరించిన భారత మ్యాప్‌ను ప్రదర్శించడం ద్వారా భారత సార్వభౌమత్వాన్ని పూర్తిగా అగౌరవపరిచిందని, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చిత్రీకరిస్తున్నదని ఆరోపించింది. ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. గాంధేయ భారతదేశం పేరుతో కాంగ్రెస్ వాదులు భారత మ్యాప్‌ను వక్రీకరించడం దేశద్రోహమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.