అన్నిస్థాయిల్లో ఐకమత్యం ఉంటేనే పార్టీ తిరిగి జవసత్వాలను పొందగలుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అందర్నీ ఎంతో షాక్‌కు గురిచేశాయని, ఎంతో బాధించాయన్న విషయం తనకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీకి తిరిగి ఎలా పట్టాలెక్కించాలి? అన్న విషయంపై తాను అనేక మంది నుంచి సలహాలు స్వీకరించానని, సమాలోచనలు కూడా జరిపానని అన్నారు.
వారు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడానికే ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొనడం గమనార్హం. ‘మీరందరూ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఎంత నిరాశతో ఉన్నారో నాకు తెలుసు. ఆ ఫలితాలు బాధాకరం, షాకింగ్‌కు కూడా గురి చేశాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెద్ద పరీక్షలో ఉందని, నిబద్ధత, అంకిత భావం, సంకల్పం, స్ఫూర్తి అన్న విషయాల్లో పార్టీ పరీక్షను ఎదుర్కొంటోందని, అందుకే అన్ని స్థాయిల్లోని నేతలు ఐకమత్యంతో ఉండాలని హితవు పలికారు. అందరికీ పార్టీ శ్రేయస్సే పరమావధి కావాలని, పార్టీ ఐకమత్యంగా ఉండేందుకు చేయాల్సిందంతా చేస్తానని పార్టీ ఎంపీలకు సోనియా హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయాణిస్తున్న మార్గం ఇప్పుడు సవాళ్లతో కూడుకుందని, ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సవాళ్లను ఎదుర్కొంటున్నారని సోనియా అన్నారు. కాంగ్రెస్ పునరుత్థానం కేవలం పార్టీ కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంతో పాటు యావత్ భారతం కోసం కూడా పార్టీ పునరుత్థానం కావాల్సిన అవసరం ఉందని సోనియా నొక్కి చెప్పారు.