(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్/న్యూఢిల్లీ/బెంగళూరు, మే 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాత కథ మళ్లీ కర్ణాటకలో పునరావృతం అయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా సీఎం ఎవరన్నది తేల్చలేక ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల్లో గెలిచేదాకా ఐక్యతారాగం.. ఆ తర్వాత ఎప్పటిలాగే అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు తగాదాలు వంటివి కాంగ్రెస్‌కు మొదటి నుంచి ఉన్నదే. ఓవైపు సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్టేనని ప్రమాణస్వీకారానికి బెంగళూరులో కంఠిరవ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతుండగా, లేదు లేదు.. ఇంకా ఎవరి పేరు ఖరారు కాలేదని బుధవారం సాయంత్రం ఏఐసీసీ నేత సుర్జేవాలా ప్రకటించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. సీఎం ఎవరన్నది ఇంకా తేలకపోవడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే పేరును ఆయన వర్గీయులు తాజాగా తెరపైకి తెచ్చారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే ఆయన వర్గీయలు డిమాండ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న హైడ్రామా
సీఎంగా సిద్ధరామయ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసిందనే వార్తలు బుధవారం వెలువడ్డాయి. ఈ వార్తలను కొట్టిపారేస్తూ ఏఐసీసీ నేత రణదీప్ సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్న సుర్జేవాలా.. తర్వాతి 2-3 రోజుల్లో కొత్త క్యాబినెట్ కొలువుదీరుతుందన్నారు.
రాహుల్‌తో వేర్వేరుగా సమావేశం
సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బుధవారం వేర్వేరుగా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తర్వాత డీకే మరోసారి ఖర్గేను కలిశారు. అనంతరం సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ ఇంట్లో పార్టీ నేతలు, మద్దతు ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చలు జరిపారు. ఖర్గే, రాహుల్‌తో జరిగిన సమావేశాల్లో సీఎం పదవి తనకే ఇవ్వాలని డీకే పట్టుబట్టినట్టు తెలిసింది.
డిప్యూటీ సీఎంకు అంగీకరించని డీకే
సీఎం పదవిని చెరో రెండున్నర ఏండ్లు పంచుకోవడానికి సిద్ధరామయ్య అంగీకరించినా డీకే ససేమిరా అన్నట్టు తెలిసింది. సీఎం పదవి ఇవ్వనప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగడానికి సిద్ధమేనని, డిప్యూటీ సీఎం కూడా వద్దని చెప్పడంతో అధిష్ఠానం ఎటూ తేల్చలేకపోతుందని తెలిసింది. డీకే అలకవహిస్తే వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలలో పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.