న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టు(Delhi Airport)లో ఇవాళ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఆ పార్టీ నేత పవన్ ఖేరా(Pawan Khera)ను చత్తీస్ఘడ్ విమానం ఎక్కకుండా అస్సాం పోలీసులు(Assam Police) అడ్డుకున్నారు. దీంతో అక్కడ అలజడి మొదలైంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఏఐసీసీ మీటింగ్‌కు వెళ్తున్న పవన్ ఖేరాను పోలీసులు అడ్డుకున్నారు. విమానం బోర్డింగ్ పాస్ ఉన్నా.. ఖేరాను నిలిపివేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎయిర్‌పోర్టులోనే ధర్నా చేపట్టారు.
తన బ్యాగ్‌తో ఏదో సమస్య ఉన్నట్లు తనకు చెప్పారని, కానీ తన వద్ద కేవలం హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉందని, విమానంలో ఎక్కడానికి వీలులేదని అడ్డుకున్నట్లు పవన్ ఖేరా తెలిపారు. ఎయిర్‌పోర్టు టార్మాక్ వద్దే కాంగ్రెస్ నేతలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.
ఎటువంటి అరెస్టు వారెంట్ లేకుండానే ఖేరాను అడ్డుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరోవైపు అస్సాం పోలీసులు కూడా ఖేరాను అరెస్టు చేసేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఖేరాపై కేసు ఉన్నందును అతన్ని విమానం ఎక్కకుండా ఆపాలన్న ఆదేశాలు తమకు ఉన్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారి పేర్కొన్నారు. ప్రధాని మోదీని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఖేరాను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.అయితే చివరకు ఎయిర్‌పోర్టులోనే ఖేరాను అరెస్టు చేశారు.