Suggestion to Rahul | రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్‌కే చెందిన ఎంపీ ఒకరు షాకిచ్చేలా వ్యాఖ్యానించారు. ‘జోడో యాత్ర మళ్లీ చేయొచ్చు.. మరోసారి అక్కడి ప్రజల్ని జాగృతం చేయొచ్చు.. దాని కన్నా ముందు ఎన్నికలు జరుగుతున్న హిమాచల్, గుజరాత్‌లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే పనిని చేపట్టండి’ అని రాహుల్‌గాంధీకి ఆయన సూచించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర గత నెల 7న ప్రారంభమై.. నిన్నటికి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది. ఇవాళ 40 వరోజు సంగనకల్లులో ‘విశ్రాంతిదినం’ పాటిస్తున్నారు. ఇక్కడి క్యాంపులోనే ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో దక్షిణ గోవా కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సార్డిన్హా సోమవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.. జోడో యాత్రను ఆపేయాల్సిందిగా రాహుల్‌గాంధీకి సూచించారు. హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలు ఓటు వేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ ప్రజలను జాగృతం చేయడానికి బదులుగా.. అక్కడి ఓటర్లను కలుసుకుని మన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వేడుకోవడం ఇప్పుడు అవసరమని చెప్పారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుందని, పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయడంలో తన పూర్తి సమయం కేటాయించాలని కోరారు.
త్వరలో జరుగనున్న హిమాచల్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నది. తమ పార్టీ అభ్యర్థులను ఎంపికచేయడంలో ఆపార్టీ పెద్దలు సోమవారం నుంచి దేశ రాజధానిలో సమావేశమై చర్చిస్తున్నారు. కాగా, హిమాచల్‌లో బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. హిమాచల్‌లో ఎన్నికలు వచ్చే నెల 12 న జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8 న వెలువడతాయి.