Congress Molestation | మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. రైలుతో ప్రయాణిస్తున్న తనపై మద్యం మత్తుల్లో ఉన్న ఎమ్మెల్యులు అసభ్యంగా ప్రవర్తించారని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పట్ల తామేమీ తప్పుడుగా వ్యవహరించలేదని ఎమ్మెల్యేలు చెప్తుండగా.. ప్రియాంక వాద్రా సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
సాగర్ రైల్వే పోలీసులకు సదరు మహిళ చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. రేవాకు చెందిన 30 ఏండ్ల మహిళ.. భర్త, ఏడు నెలల చిన్నారితో కలిసి రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలులో రాణి కమాలాపతి స్టేషన్‌కు బయల్దేరింది. అర్ధరాత్రి దాదాపు 11.50 గంటల సమయంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సునీల్ సరాఫ్ (కోట్మా), సిద్దార్థ్ కుష్వాహా ( సాత్నా) తమ భోజనాలు ముగించిన తర్వాత ఆమె భుజంపై చేయి అసభ్యంగా మాట్లాడారు. పిల్లాడు పడుకున్నందున డిస్టర్బ్ చేయొద్దని వేడుకున్నా వినకుండా అసభ్య పదజాలం వాడుతూ ఆమెను హేళన చేశారు. వీరి ప్రవర్తనను వెనక సీట్లో ఉన్న తన భర్తకు తెలియజేయగా.. ఆయన రైల్వే మంత్రికి ట్వీట్ చేయగా సాగర్ రైల్వే పోలీసులు వారి వద్దకు వచ్చారు. అయితే, సాగర్ స్టేషన్లో మహిళా అధికారులు లేనందున బినా స్టేషన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై రైలులోని టీటీఈకి కూడా ఫిర్యాదు చేసినా వారిని వారించలేదు. పైగా తమనే మరో బోగీలోకి మార్చారని ఆ మహిళ వాపోయింది.
కాగా, తమపై మహిళ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సునీల్ సరాఫ్, సిద్దార్థ్ కుష్వాహా ఖండించారు. తాము ఆ మహిళను తాకడం గానీ, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంగానీ చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. తమపై ఆరోపణలు చేసిన మహిళ చేతిలో చిన్న బిడ్డ ఉన్నందున తమ సీటును ఆమెకు ఆఫర్ చేశామని చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మహిళ ప్రయాణికురాలిని వేధించిన ఘటనపై ప్రియాంక వాద్రా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలా అసభ్యంగా ప్రవర్తించడం కాంగ్రెస్ నేతల ప్రాథమిక లక్షణం అని, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టొద్దని ఆయన పోలీసులను విజ్ఞప్తి చేశారు.