న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు మళ్లీ సుప్రీంకోర్టు మొండిచెయ్యి చూపించింది. అస్సాంలో పోలీసులు నమోదు చేసిన కేసులో రెండోసారి కూడా ఆయన ఊరట దక్కలేదు. గౌహతి కోర్టును ఆశ్రయించాలని పవన్ ఖేరాను సుప్రీంకోర్టు కోరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను పొడిగించేందుకు సుప్రీకోర్టు వరుసగా రెండో సారి నిరాకరించింది. అస్సాం పోలీసులు ఖేరాపై పరువునష్టం, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఉపశమనం కావాలంటే గుహతి హైకోర్టును ఆశ్రయించాలని జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చంద్రకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. మీరు వెళ్లి అస్సాంలో పిటీషన్ దాఖలు చేయండి, కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది.
అస్సాం సీఎం బిశ్వశర్మ భార్య రినికి భుయాన్‌కు పలు దేశాల్లో పాస్‌పోర్టులు ఉన్నట్లు ఓ మీడియా సమావేశంలో ఖేరా ఆరోపించారు. ఆ ఆరోపణల నేపథ్యంలో ఖేరాపై కేసు బుక్ చేశారు. ఏప్రిల్ 7వ తేదీన ఢిల్లీలోని ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు వెళ్లారు. ఇక ట్రాన్సిట్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆయన ఆవ్రయించారు. ఏప్రిల్ 10వ తేదీన ఆయనకు తెలంగాణ కోర్టు రిలీఫ్ ఇచ్చింది. కానీ తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై ఏప్రిల్ 15వ తేదీన సుప్రీం స్టే ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టు స్టేను సవాల్ చేస్తూ ఖేరా ఇవాళ మళ్లీ సుప్రీంలో దరఖాస్తు చేసుకున్నారు. స్టే ఎత్తివేసేందుకు సుప్రీం నిరాకరించడంతో.. నేనేమైనా ఉగ్రవాదినా అని ఖేరా తరపున న్యాయవాది సింఘ్వీ అన్నారు.