Congress : మహారాష్ట్ర (Maharastra) లోని ఓ మున్సిపాలిటీలో రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య విచిత్ర పొత్తు కుదిరింది. థానే జిల్లాలోని అంబర్నాథ్ (Ambarnath) మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు దక్కకుండా చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఆ సిద్ధాంతాలను పక్కనపెట్టి పొత్తు పెట్టుకున్నాయా..? అని పలువురు రాజకీయ ప్రముఖులు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అంబర్నాథ్ బ్లాక్‌లోని కాంగ్రెస్ నాయకత్వంపై చర్యలు తీసుకుంది. హైకమాండ్‌కు తెలియకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు అంబర్నాథ్ బ్లాక్ అధ్యక్షుడిని, గెలిచిన 12 మంది కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
అంబర్నాథ్ బ్లాక్‌లోని మొత్తం 60 స్థానాలకుగాను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం నాలుగు స్థానాల దూరంలో ఆగిపోయింది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ మూడు పార్టీలు మరో ఇద్దరు ఇండిపెండెంట్లతో కలిసి జట్టుకట్టాయి. అంబర్నాథ్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నాయి.