న్యూఢిల్లీ: కరోనా పాపం కాంగ్రెస్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ పార్టీ వందేండ్ల వరకు అధికారంలోకి రాలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సోమవారం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కరోనా తొలి విడతలో వలస కార్మికులను భయందోళనకు గురి చేసి వారు తమ గ్రామాలకు వెళ్లి కరోనాను వ్యాపించేలా చేసిందని విమర్శించారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రజలకు కాంగ్రెస్ సూచించలేదని మండిపడ్డారు. మరోవైపు తమ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడి, నియంత్రణతోపాటు వ్యాక్సినేషన్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు.
దేశంలో తన ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నదని ప్రధాని మోదీ విమర్శించారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిందన్నారు. 1998 నుంచి నాగాలాండ్, 24 ఏండ్లుగా ఒడిశాలో, గోవాలో చాలా ఏండ్లు, 1972 తర్వాత బెంగాల్లో, 1962 తర్వాత తమిళనాడులో, సుమారు పదేండ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. అయితే మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తోపాటు విపక్ష పార్టీ సభ్యులు నిరసన తెలిపారు.
దీంతో ప్రతిపక్షంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. పార్టీ అంశాల కోసం పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటున్నారని అందుకే తాను ఇలా స్పందించానని అన్నారు. చాలా ఎన్నికల్లో ఓడినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అహంకారం పోలేదన్నారు. మరో వందేళ్లకు కూడా అధికారంలోకి వచ్చే ఆసక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. గుడ్డి ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయంటూ మండిపడ్డారు. తన ప్రసంగానికి ముందు ఆదివారం మరణించిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు మోదీ నివాళి అర్పించారు.