Shatrughan Sinha | కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిందా.. శక్తిమంతమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించలేకపోతుందా? అంటే రాజకీయ నాయకుడిగా మారిన బాలీవుడ్ నటుడు శత్రఘ్న సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శక్తిమంతమైన విపక్ష పాత్ర పోషించలేని వారికి భవిష్యత్లో ఆ పాత్ర పోషించగల శక్తి లేదు. ఇటీవల, ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఏం జరిగిందో వారు చూశారు అని అన్నారు.
అసన్సోల్ లోక్సభ స్థానానికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శత్రఘ్నసిన్హాను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సోమవారం తృణమూల్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ జనశక్తితో అధికార బీజేపీ ధనశక్తిని ఎదుర్కొని మమతా బెనర్జీ నిలిచారని అన్నారు. కేంద్రంలోని బీజేపీకి మమతా బెనర్జీ ప్రత్యామ్నాయంగా నిలుస్తారని చెప్పారు. ఆమెపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు.
అసన్సోల్ ప్రజలకు, పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షల మేరకు తాను పని చేస్తానన్నారు. తాను నూతన మార్గంలో ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందనుకుంటా. కానీ ఇదే తనకు సరైన మార్గం అని సిన్హా అభిప్రాయ పడ్డారు. అసన్సోల్కు తాను బయటి వ్యక్తినన్న విమర్శపై స్పందిస్తూ.. వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధానికి కూడా ఈ అంశం వర్తింప చేయాలని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.