న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. 2029 డెడ్‌లైన్‌ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి మహిళా సాధికారత చట్టం గురించి పార్లమెంట్లో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న నారీ శక్తి వందన సమ్మేళనం కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరి కృషిని దృష్టిలో పెట్టుకుని మహిళా సాధికార బిల్లుకు ఆమోదం జరిగేలా చూడాలన్నారు. దేశంలోని ప్రతి మహిళ సంతోషపడుతుందని, ప్రతి మహిళకు లబ్ధి చేకూరుతుందన్నారు.
నారీ శక్తి వందన్ అభినియం యాక్ట్ రూపకల్పన 21వ శతాబ్ధంలోనే అత్యంత కీలకమైన అంశమన్నారు. కొత్త చరిత్ర సృష్టించేందుకు పార్లమెంట్ వేదిక కానున్నదని, గత విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు ఆశయాలను తీర్చనున్నట్లు ఆయన చెప్పారు. మన దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థలన్నీ మహిళల నాయకత్వానికి అసాధారణ వేదికలయ్యాయన్నారు. ప్రసంగాలతో చైతన్యపరచడానికి ఇక్కడకు రాలేదని, ఈ దేశ మహిళల ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు ప్రధాని చెప్పారు. భారతీయ మహిళలు ఈ దేశానికి ఎంతో మేలు చేశారన్నారు. ప్రజాస్వామ్య విధానంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కొన్ని దశాబ్ధాలుగా అందరూ అనుకున్నారని, 2023లో నారీశక్తి వందన్ అభినియం బిల్లును అన్ని పార్టీలు ఏకపక్షంగా ఆమోదించాయన్నారు.
2029 నాటికి మహిళా కోటా బిల్లును అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రతిపక్షంగా గట్టిగా గతంలో వ్యక్తం చేసిందని, అయితే ఆ బిల్లుపై సుదీర్ఘమైన రీతిలో చర్చలు జరగాలని, సహకారం, భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రధాని మోదీ తెలిపారు. నిర్ణయాత్మక అంశాల్లో మహిళ భాగస్వామ్యం పెరిగితే, వ్యవస్థలో మార్పు వేగంగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. జల జీవన్ మిషన్‌లో మహిళల పాత్ర ప్రశంసనీయమన్నారు.