Assam : అసోంలోని కోక్రాఝర్ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య ఆందోళనతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఒక వర్గానికి చెందిన మతి స్థిమితం లేని మహిళపై మరో వర్గానికి చెందిన రఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్ పీ సహా పలు హిందూ, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడి పత్తర్ ఘాట్ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మతి స్తిమితం లేని ఒక మహిళపై రఫికుల్ ఇస్లాం అనే వ్యక్తి శనివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో వీహెచ్ పీ, పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుడికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు సంఘాలు 12 గంటల బందుకు పిలుపునిచ్చాయి. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆంక్షలు విధించారు. జిల్లా కేంద్రంలో ఇరువర్గాలకు చెందిన నేతలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డిప్యూటీ కమిషనర్ పంకజ్ చక్రవర్తి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించారు. కాగా, నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే, అతడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి.