న్యూఢిల్లీ : కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్ధీకరించడానికి కేంద్రం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. అటువంటి పోస్టులను కాలనుగుణంగా గుర్తించడానికి, అంచనా వేయడానికి కమిటీలను తప్పనిసనిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక వేళ ఏదైనా పోస్టు వారికి సరిపోతుందని భావిస్తే, అన్ని తదుపరి ప్రమోషనల్ పోస్టులు కూడా దివ్యాంగులకు రిజర్వ్ చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ చట్టం, 2016కు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలులో అసమానతలు, పోస్టులను గుర్తించడంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లాంటి సంస్థలు వైఫల్యం చెందడంపై విమర్శలు చేసింది. ఈ సందర్భంగా వైకల్య నిర్ధారణకు ఏకరీతి మార్గదర్శకాలు ఏర్పాటు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మంట్ ఆఫ్ పర్సన్స్ విట్ డిజేబిలిటీస్ (డీఈపీడబ్ల్యూడీ)ని ఆదేశించింది.