(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, జూలై 22: కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కదిపిందా? గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు, నీట్ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపిందంటూ ఆప్ ఆరోపించడం, కేంద్రం-కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందా? అని సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ పార్లమెంట్ సాక్షిగా నిలదీయడాన్ని చూస్తే, ఇది నిజమేననిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు మరికొందరు విద్యార్థులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత నెల 20న నిరసన దీక్షకు దిగారు. దాదాపు నెలరోజులకు పైగా సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పార్లమెంట్ ముట్టడికి సీజేపీ నేతలు, విద్యార్థులు ప్రయత్నించడం.. పోలీసులు లాఠీఛార్జీ చేయడం వివాదాస్పదమయ్యింది. ఈ క్రమంలో జెన్‌జీ యువతకు సోషల్‌మీడియాలో పెద్దయెత్తున మద్దతు లభించింది. ఇది గమనించిన రాహుల్ ఆయన పరివారం.. 31 రోజుల తర్వాత మంగళవారం ఉన్నట్టుండి ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించి పెద్ద డ్రామాకు తెరతీసింది.
దీనిపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థి ఉద్యమం ప్రారంభమై నెలరోజులు గడిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్.. నిరసనల్లో పాల్గొనడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని పలువురు మండిపడ్డారు. విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులమడానికే కాంగ్రెస్ ఇలా కుట్రలకు తెరలేపిందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమ్‌నాథ్ భారతి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ప్రస్తుత నీట్ వివాదాన్ని డైవర్ట్ చేయడానికి బీజేపీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. బీజేపీ ఒత్తిడికి రాహుల్ తలొగ్గారు. ఒకవేళ, రాహుల్ నిజంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించాలని కోరుకొంటే జంతర్‌మంతర్‌కు వెళ్లొచ్చుగా. ప్రధాని ఇంటి ముందు ధర్నా ఎందుకు?’ అని ఆయన నిలదీశారు.
విద్యార్థి ఉద్యమానికి కాంగ్రెస్ రాజకీయ రంగు పులమడానికి రెండు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకటి క్రెడిట్ చోరీ కాగా, రెండోది పరోక్షంగా బీజేపీని కాపాడటానికేనని విశ్లేషిస్తున్నారు. ఆర్థిక మాంద్యం, ఆహార సంక్షోభం కారణంగా 2022లో శ్రీలంకలో జెన్‌జీ ఉద్యమం ఉద్ధృతమయ్యింది. జాబ్ కోటాకు సంబంధించి 2024లో బంగ్లాదేశ్‌లో, అవినీతికి వ్యతిరేకంగా నిరుడు నేపాల్లోనూ విద్యార్థి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. జెన్‌జీ సెగతో ఈ మూడు దేశాల్లో ప్రభుత్వాలు మారాయి. అంతేకాదు, ప్రభుత్వాలను ప్రశ్నించడంలో విఫలమైన ప్రతిపక్ష నాయకులను కూడా ఆయా దేశాల్లోని యువత వదిలిపెట్టలేదు. ఇది గుర్తించిన ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ పెద్దలు కలిసి చీకటి ఒప్పందం చేసుకొని ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నీట్ యూజీ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనపై అణచివేత అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించకపోవడంపై బుధవారం పార్లమెంట్లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్, బీజేపీ మంత్రి కిరణ్ రిజిజును మాట్లాడేందుకు అనుమతించి.. తనకు ఆ అవకాశాన్ని ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై తీవ్రంగా స్పందించిన అఖిలేశ్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా? అంటూ ధ్వజమెత్తారు. ‘ఈ సమస్య ఎస్పీ, కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన అంశం కాదు. ఇది విద్యార్థులు, యువజనులకు సంబంధించినది. వారిని(బీజేపీ), వీరిని(కాంగ్రెస్) మాట్లాడేందుకు మీరు అనుమతించారు. మరి మా పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ఏదైనా ఒప్పందం కుదుర్చుకుందా? మీరేమైనా అవగాహనకు వచ్చారా?’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు.