కోల్కతా: ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 63 వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో 34 వేల పైచిలుకు పంచాయతీలను టీఎంసీ కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ రెండోస్థానంతో, లెఫ్ట్ పార్టీలు మూడో స్థానంతో, కాంగ్రెస్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 344 గ్రామ పంచాయతీల్లో విజేతను టాస్ నిర్ణయించింది. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక పంచాయతీలో ప్రత్యర్థులిద్దరికీ ఓట్లు సమంగా వచ్చినట్లయితే వారిలో విజేతను టాస్ ద్వారా నిర్ణయిస్తారు. అయితే, గతంలో కూడా టాస్ ద్వారా విజేతను నిర్ణయించే సంప్రదాయం ఉన్నదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.