Coffee stalls : అరకు కాఫీ (Araku Coffee) కి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ (Parliament) ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ (Araku Coffee Stalls) ప్రారంభం కానున్నాయి. సభాపతి ఆదేశమేరకు రెండు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా (Kul Mohan Singh Arora) ఉత్తర్వులు జారీచేశారు. సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద ఈ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోకసభ సచివాలయం అనుమతిచ్చింది.
కాఫీ స్టాల్స్ ప్రారంభం కోసం గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు పార్లమెంట్లో ఈ కాఫీ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. పార్లమెంట్ భవన్లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమవుతాయని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అరకు కాఫీకి ఈ స్థాయి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.