Coaching center Tragedy : ఢిల్లీ కోచింగ్ సెంటర్ (Coaching centre) విషాద ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు (Delhi police) ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముందుగా అరెస్టయిన ఐదుగురు నిందితులను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు (Tis Hazari Court) లో హాజరుపర్చారు. కోర్టు ఆ ఐదుగురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody) విధించింది.
తాజాగా కోచింగ్ సెంటర్ ముందు భారీగా నిలిచిన వరద నీటిలో SUV ని వేగంగా నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 7కు చేరింది. ఈ నెల 27న సాయంత్రం భారీ వర్షం కారణంగా రోడ్లపై వరద నిలిచింది. ఈ క్రమంలో రవూస్ కోచింగ్ సెంటర్ ముందు నుంచి SUVలో వెళ్లిన ఓ వ్యక్తి వాహనాన్ని వేగంగా నడిపారు. దాంతో ఆ వరద తాకిడికి కోచింగ్ సెంటర్ గేటు ఊడిపోయింది.
దాంతో రోడ్డుపై ఉన్న నీరు వేగంగా సెల్లార్లో వెళ్లింది. దాంతో సెల్లార్లో చిక్కుకున్న విద్యార్థులు బయటికి రావడం కష్టమైంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి పరోక్షంగా విద్యార్థుల మృతికి కారణమైనందున సోమవారం సాయంత్రం పోలీసులు ఆ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ నెల 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రవూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్లో సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది.
సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న 33 మంది విద్యార్థులు ఈ వరదలో చిక్కుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 30 మంది విద్యార్థులను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు.