చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్ వయసు 68 ఏళ్లు. కానీ ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తుంటారు. అయితే మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో ఆయన్ను ఓ మహిళ ఇదే ప్రశ్న వేసింది. మీరింత యంగ్‌గా ఎలా కనిపిస్తున్నారని ఆమె నవ్వుతూ ప్రశ్నించింది. దానికి స్టాలిన్ కూడా కాస్త సిగ్గుపడుతూనే.. డయిట్ కంట్రోల్ చేస్తూ అంటూ సమాధానం ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను డీఎంకే పార్టీ ఆన్లైన్లో పోస్టు చేసింది.
డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తమ నేత స్టాలిన్‌కు సంబంధించిన ఫిట్నెస్ వీడియోలను తరుచూ పోస్టు చేస్తూనే ఉన్నది. గత నెలలో స్టాలిన్ వర్కౌట్ చేస్తున్న వీడియోను ఒకటి షేర్ చేశారు. జిమ్‌లో రొటీన్ ఎక్సర్సైజ్లు చేస్తున్న 37 సెకన్ల ఆ వీడియో వైరల్ అయ్యింది. మరో వీడియోలోనూ ఆయన సైకిల్ తొక్కుతూ, సెల్ఫీలు దిగుతూ కనిపించారు. తన జీవితంలో యోగా కూడా భాగమే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టాలిన్ తెలిపారు. వీలైనప్పుడు మనవళ్లు, మనవరాళ్లతోనూ ఆడుకుంటానని చెప్పారు.