చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్భవన్లో కూర్చునే గవర్నర్ ప్రతిపక్షం కన్నా ఎక్కువగా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆయన గవర్నర్ బంగ్లాలో కూర్చుని ద్రవిడ విధానాన్ని ఎగతాళి చేస్తుంటారని మండిపడ్డారు. ‘నేను చెప్పేదేంటంటే గవర్నర్ తమిళనాడులోనే ఉండాలి. ఆయన మన భాష, జీవన విధానంపై నిరంతరం దాడి చేయడం వల్ల మన సంస్కృతి, భాష పట్ల మన ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గిపోదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ గవర్నర్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ దేశంలోనే బీజేపీ పాలిత యూపీ నేరాల్లో మొదటి స్థానంలో ఉందన్న విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రక్షణ లేకపోతే తాము అధికారంలోకి వచ్చాక రాష్ర్టానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.