హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): మరో 25 ఏళ్ల వరకు లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచవద్దని, వాజ్‌పేయీ తరహాలోనే నియోజక వర్గాల డీలిమిటేషన్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 1976, 2001 సంవత్సారాల్లో కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం లోక్‌సభ సీట్లు పెంచకుండా పునర్విభజన చేయాలని ఆయన సూచించారు.
చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు.
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలు, సీఎంల తదుపరి సమావేశం హైదరాబాద్‌లో ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. చెన్నైలో శనివారం జరిగిన జేఏసీ తొలి సమావేశం అనంతరం ఈ విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు.