గువాహటి: బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఢుబ్రి జిల్లాలో రాత్రి సమయంలో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అలజడి సృష్టించేందుకు ఓ మత వర్గం చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో బయటకు వచ్చినవారిని, రాళ్లు విసిరేవారిని అరెస్ట్ చేస్తామన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని, జిల్లాలోని నేరగాళ్లను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఢుబ్రి పట్టణంలోని ఓ దేవాలయం వద్ద మాంసపు ముక్కలు కనిపించడంతో కొందరు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో సోమవారం నిషేధాజ్ఞలను విధించారు, మంగళవారం ఆ ఆదేశాలను ఉపసంహరించారు.
అందరూ ఉన్నా..ఒంటరివాళ్లం ; 54శాతం మంది వయోధికుల్లో ప్రతికూల భావాలు: అధ్యయనం
న్యూఢిల్లీ, జూన్ 13: వృద్ధుల్లో దాదాపు 54 శాతం మంది ప్రతికూల భావాల్ని (నెగిటీవ్ ఫీలింగ్స్).. వృద్ధాప్యంతో ముడిపెడుతున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సమాజంలో యువత, వృద్ధుల మధ్య భావోద్వేగ సంబంధం తరుచుగా లోపిస్తున్నదని, రెండు తరాల మధ్య అంతరాలను పూడ్చడానికి తక్షణ చర్యలు అవసరమని ‘హెల్ప్ ఏజ్ ఇండియా’ నివేదిక పేర్కొన్నది. 10 నగరాల్లో యువత, వృద్ధులపై చేపట్టిన సర్వే నివేదికను జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
దీని ప్రకారం, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు.. కుటుంబంతోపాటు జీవిస్తున్నా తాము ఒంటరి వాళ్లమనే భావన 47 శాతం మంది వ్యక్తం చేశారు. యువత తమ పట్ల గౌరవంగా ఉండటం లేదని, నిశ్శబ్దంగా ఉండిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమను పక్కకు పెడుతున్నారని మదురైకి చెందిన ఓ వృద్ధుడు చెప్పుకొచ్చాడు. ఒకే కుటుంబంగా ఉంటున్నా.. ఒంటరిగా భోజనం చేస్తున్నానని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు. ముంబై, ఢిల్లీ నగరాలతో పోల్చితే కాన్పూర్, మదురై లాంటి నాన్-మెట్రో నగరాల్లో ఉమ్మడి కుటుంబాలు బలమైన బంధాలన్ని పెంపొందించాయని తేలింది. వృద్ధుల్లో రెండింట మూడొంతుల మంది డిజిటల్ టూల్స్ పట్ల గందరగోళానికి గురవుతున్నారు. 2050 నాటికి భారతదేశంలో వృద్ధుల జనాభా 19 శాతానికి చేరుకుంటుందని అంచనా.