Eknath Shinde | ముంబై, మే 13: లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో ‘నాథ్ ఆపరేషన్’ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావొచ్చని వ్యాఖ్యానించారు. ‘నేను ఇటీవల కర్ణాటలో ఒక ర్యాలీకి వెళ్లాను. తమ రాష్ట్రంలోనూ ‘నాథ్ ఆపరేషన్’ అవసరమని వారన్నారు. ఏమిటీ ఆపరేషన్ అని నేడు అడిగితే.. మహారాష్ట్రలో మీరు చేసిందే అన్నారు’ అని షిండే తెలిపారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్ జరగవచ్చని ఆయన పేర్కొన్నారు.
అయితే షిండే వ్యాఖ్యలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కొట్టిపారేశారు. అది వారి భ్రమ అని.. ఎవరూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరని చెప్పారు. గతంలో ఇలా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇది మహారాష్ట్ర కాదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోనుందని చెప్పారు. ‘ఈ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో తన ప్రభుత్వం ఉంటుందో.. ఉండదో అని షిండేకు భయం పట్టుకుంది. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు’ అని శివకుమార్ అన్నారు.