గుజరాత్ రాష్ట్రంలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థికి సీనియర్లు బలవంతంగా మూత్రం తాగించారని ఆరోపిస్తూ అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. స్కూల్లో నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకల్లో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ విషయంపై పాఠశాల అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఈ ఘటన అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ ప్రాంతంలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలో జరిగింది. ఆ పాఠశాలలో వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ వేడుకల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కొడుకును 12వ తరగతి విద్యార్థులు బలవంతంగా వాష్‌రూంలోకి లాక్కెళ్లి మూత్రం తాగించారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల అధికారులు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తర్వాత తమ కొడుకు డిప్రెషన్‌కు గురయ్యాడని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తొమ్మిదో తరగతి విద్యార్థిపై సీనియర్లు మజ్జిగ, సున్నం నీళ్లు పోశారని వస్త్రాపూర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్జీ ఖంబ్లా తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయమని, దీనిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. తమ స్కూల్లో ఇలాంటి ఘటనే జరగలేదని, తాను మీడియా ముందు దీనిగురించి ఏమీ చెప్పనని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జెన్నీ జేమ్స్ వ్యాఖ్యానించడం గమనార్హం.