కోల్కతా: బడికి సెలవు రావాలనే ఉద్దేశంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న పసి బాలుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లా, ఘస్టోరియాలో ఓ ప్రైవేటు పాఠశాలలో వీరిద్దరూ చదువుతున్నారు. జనవరి 30న మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు.
రెండు రోజుల తర్వాత అదే పాఠశాలకు దాదాపు 400 మీటర్ల దూరంలోని నీటి గుంటలో ఆ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఉండవచ్చునని పోలీసులు భావించారు. కానీ ఆ బాలుడు హత్యకు గురయ్యాడని పోస్ట్మార్టంలో తేలింది. పురూలియా పోలీసు సూపరింటెండెంట్ అభిజిత్ బెనర్జీ మాట్లాడుతూ, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అనుమానం వచ్చి ప్రశ్నించామని చెప్పారు. బడికి సెలవు రావాలనే ఉద్దేశంతో ఈ బాలుడిని తీసుకెళ్లి, తలపై కొట్టి, నీటిలోకి విసిరేసినట్లు అతను అంగీకరించాడని తెలిపారు.