న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) ఇవాళ తన ఆమరణ దీక్షను విరమించారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అభ్యర్థన మేరకు దీప్కే తన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ మార్చ్ చేస్తున్న వారికి సంఘీభావంగా దీక్షను విరమించాలని వాంగ్‌చుక్ కోరారు. డెహ్రాడూన్‌కు చెందిన నీట్ అభ్యర్థి రాయ్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె తండ్రితో కలిసి దీప్కే దీక్షను విరమించారు. ప్రస్తుతం సప్దార్‌జంగ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్ చికిత్స పొందుతున్నారు. జంతర్ మంతర్ వద్ద ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వాంగ్చుక్ను తరలించిన తర్వాత .. అభిజీత్ దీప్కే ఆమరణ దీక్షకు పూనుకున్నారు.
మరో వైపు పార్లమెంట్లో విద్యార్థుల ఆందోళనపై రచ్చ కొనసాగుతోంది. ఇవాళ ప్రారంభమైన ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఇప్పటికే పలుమార్లు లోక్‌సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని రాజ్యసభలో ఖర్గే ఆరోపించారు.
పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇవ్వాలని వాంగ్‌చుక్ కోరారు. ఆస్పత్రి నుంచి తాత్కాలికంగా డిశ్చార్జ్ చేయాలని కోరినట్లు తెలిసింది.