CJI Sanjiv Khanna | కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తప్పుకున్నారు. ఈ కేసును మరో బెంచ్‌కి బదిలీ చేస్తామని మంగళవారం ప్రకటించిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా.. తదుపరి కేసు విచారణను 2025 జనవరి ఆరో తేదీకి వాయిదా వేశారు. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు.
ఈ అంశంపై దాఖలైన ఆరు పిటిషన్లు.. సీజేఐ సంజీవ్ ఖన్నాతోపాటు జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ మంగళవారం విచారణకు వచ్చాయి. ‘ఈ పిటిషన్లను నేను విచారించలేను’ అని న్యాయవాదులకు సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణన్, ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. ఇంతకు ముందు ఇదే పిటిషన్లపై జస్టిస్ ఖన్నా బెంచ్ విచారించడానికి అభ్యంతరం లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటైరైన తర్వాత దేశ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.