న్యూఢిల్లీ, జనవరి 22: భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం ధ్రువతార వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మనం పయనించాల్సిన మార్గం సంక్లిష్టంగా ఉన్నప్పుడు.. అది రాజ్యాంగ వ్యాఖ్యాతలకు, కార్యనిర్వాహక వర్గానికి సూచనలతో మార్గనిర్దేశం చేసి ధ్రువ నక్షత్రంలా దారిచూపుతుందని అన్నారు.
శనివారం ఢిల్లీలో జరిగిన నానీ ఎ పాల్కీవాలా స్మారక కార్యక్రమంలో ప్రసంగిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించిన 1973 కేశవానంద భారతి కేసు చారిత్రక తీర్పును ప్రశ్నిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్‌కు అపరిమిత అధికారాలు ఉంటాయని, దాన్ని ఏ అధికారమైనా ప్రశ్నిస్తే ‘మనది ప్రజాస్వామ్య దేశం’ అని చెప్పడం కష్టమని ధన్కర్ అన్నారు. చట్టాల రూపకల్పనలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు.
అందులోనే న్యాయమూర్తుల నైపుణ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం ఆత్మ దెబ్బతినకుండా అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగిఉంటుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం లేదా తత్వం అనేది రాజ్యాంగ ఆధిపత్యం, చట్టబద్ధమైన పాలన, అధికారాల విభజన, న్యాయసమీక్ష, లౌకికవాదం, సమాఖ్య విధానం, స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం, ఐక్యత, దేశ సమగ్రతపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
భారత రాజ్యాంగానికి ఎవరూ మార్చలేని ఒక నిర్దిష్ట గుర్తింపు ఉందని నానీ పాల్కీవాలా తమకు చెబుతూ ఉండేవారని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకొన్నారు. గతకొంత కాలంగా భారత న్యాయవ్యవస్థ కూడా గణనీయమైన మార్పులు చెందుతూ వస్తున్నదని అన్నారు. కఠినమైన నిబంధనలను తొలగించేందుకు అనుకూలత, వినియోగదారుల సంక్షేమాన్ని పెంపొందించడం, వాణిజ్య లావాదేవీలకు మద్దతు పలకడంలో చురుగ్గా పనిచేస్తున్నదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
సవరణల రద్దులో కీలకం..
పలు రాజ్యాంగ సవరణలను రద్దు చేయడంతో పాటు పక్కన బెట్టడంలో ఈ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతం అనేది కీలకంగా ఉన్నది. ఈ జాబితాలో ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణ, అనంతరం చేసిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం కూడా ఉన్నది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్రకు విశేష ప్రాధాన్యం ఇస్తూ.. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ఎన్‌జేఏసీని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నించింది.
సీజేఐపై ప్రధాని ప్రశంసలు
న్యాయస్థానాల తీర్పులను త్వరలో ప్రాంతీయ భాషల్లోనూ అందిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఎంతో మంది పౌరులకు, ముఖ్యంగా యువకులకు ఇది దోహదపడుతుందని అన్నారు. తీర్పులను అనువాదం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటామని గోవా, మహారాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ తెలిపారు. ఈ ప్రసంగ వీడియోను మోదీ ట్వీట్ చేశారు.
కొలీజియంపై రిజిజు మరోసారి విమర్శలు
కొలీజియం వ్యవస్థను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి టార్గెట్‌గా చేసుకొన్నారు. తనకు తానే న్యాయమూర్తులను నియమించుకోవాలని నిర్ణయించుకోవడం ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని హైజాక్ చేసిందని ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తు జస్టిస్ ఆర్ఎస్ సోథి పేర్కొన్నారని చెబుతూ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. జస్టిస్ సోథి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘మెజారిటీ ప్రజలు ఇలాంటి వివేకవంతమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను, ప్రజాతీర్పును విస్మరించే వ్యక్తులు మాత్రమే భారత రాజ్యాంగానికి తాము అతీతమని భావిస్తారు’ అని రిజిజు తన ట్వీట్లో అన్నారు. కాగా, కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని ఇటీవల ఆయన సీజేఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.