CJI Chandrachud | పుణె, అక్టోబర్ 20: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఒక పరిష్కారానికి తాను భగవంతుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడే ఒక మార్గాన్ని కనుగొంటాడని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. తన స్వగ్రామమైన ఖేడ్ తాలుకాలోని కన్హెర్సర్ గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘పరిష్కారం దొరకని కేసులు చాలా అరుదుగా మా వద్దకు వస్తుంటాయి. అలాంటిదే అయోధ్య కేసు కూడా.
మూడు నెలలుగా ఈ కేసు నా వద్ద ఉంది. నేను భగవంతుడి ముందు కూర్చొని, కేసుకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పాను’ అని సీజేఐ పేర్కొన్నారు. తాను రోజూ భగవంతుడికి ప్రార్థనలు చేస్తానన్నారు. ‘నమ్మండి, మీకు గనుక విశ్వాసం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మీకు మార్గం చూపిస్తాడు’ అని ఆయన అన్నారు. కాగా, శతాబ్ద కాలంగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు చెప్పింది. కాగా, ఆ ధర్మాసనంలో డీవై చంద్రచూడ్ కూడా సభ్యుడిగా ఉన్నారు.