న్యూఢిల్లీ: కర్నాటకలో జరిగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. హిజాబ్ వివాదంపై త్రిసభ్య ధర్మాసనంతో విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌ను ధరించి విద్యా సంస్థలకు వెళ్లడం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాలేజీల్లో హిజాబ్ ధరించవద్దు అని కర్నాటక ప్రభుత్వం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ వీ సుబ్రమణియన్, జస్టిస్ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అడ్వకేట్ మీనాక్షీ ఆరోరా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి ఆరు నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయని, విద్యార్థులకు ఎటువంటి సమస్య రావద్దు అని ఆ పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఈ సమస్యను పరిష్కరిస్తామని, దీన్ని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని, కొత్త తేదీను త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యేలా మధ్యంత ఉత్తర్వులు జారీ చేయాలని మీనాక్షి కోరారు.