రాంచీ, నవంబర్ 15: న్యాయ వ్యవస్థ పాత్ర పాత వివాదాలను పరిష్కరించడం కంటే ఎక్కువగా ఉంటుందని, అమాయకులను రక్షించడంపై కూడా న్యాయవ్యవస్థ దృష్టి పెట్టాలని కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నొక్కి చెప్పారు. హైకోర్టులు తమ సంస్థాగత వృద్ధిని ఆధునిక అత్యవసర సేవల మాదిరిగానే ఊహించుకోవాలని, వేగవంతమైన, నిర్ణయాత్మక, ప్రభావవంతమైన ప్రతిస్పందనలను అలవర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. శనివారం జార్ఖండ్ హైకోర్టు రజతోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఇద్దరు పిల్లలకు సంబంధించిన కస్టడీ వివాదంలో సందర్శన హక్కుల కోసం తన విచారణ చేసిన మొదటి కేసును, అభ్యర్థనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైకోర్టులు దవాఖానల్లో అత్యవసర వార్డుల మాదిరిగానే వాటి అభివృద్ధిని ఊహించుకోవాలని, ఇవి వేగంగా స్పందించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయని అన్నారు. అత్యవసర వార్డు ఆలస్యాన్ని భరించ లేని విధంగానే మన న్యాయస్థానాలు కూడా ఆ స్థాయి సంసిద్ధత, సామర్ధ్యం, ప్రతిస్పందనను కోరుకుంటాయన్నారు. అదే సమయంలో సాంకేతిక సామర్ధ్యా న్ని బలోపేతం చేసుకోవాలన్నారు.