CJI Chandrachud | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రీఫ్ లేని లాయర్.. బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్లాంటివాడు’ అన్న ఆయన.. ‘కోర్టుకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను చదవాలి’ అని సూచించారు. సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ కేసు విచారణ జరుగుతున్నది. ప్రతివాది తరఫున తాను హాజరైనట్లు ఓ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, కేసుకు సంబంధించిన వివరాలను తనకు తెలపాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదికి సూచించారు. సదరు న్యాయవాది స్పందించలేకపోయారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మీరు ఈ కేసు ఫైళ్లను చదివారా? అని న్యాయవాదిని ప్రశ్నించింది.
ఫైళ్లు లేకుండా కోర్టుకు హాజరుకావద్దని స్పష్టం చేసింది. న్యాయవాది నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సీజేఐ మాట్లాడుతూ.. మీరు పేపర్లు లేకుండా బ్యాండ్, గౌను ధరించడం తప్పని, బ్రీఫ్ లేని లాయర్ బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ లాంటివాడన్నారు. ఇది సరికాదని.. గౌన్, బ్యాండ్ ధరించి వచ్చారని, కానీ దస్త్రాలు లేవని అన్నారు. ‘మీ బ్రీఫ్ (కేసు ఫైలు) ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి’ అని సూచించారు. సీనియర్ న్యాయవాది లేకుంటే చర్చకు అవకాశం తీసుకోవాలని యువ న్యాయవాదికి సున్నితంగా సూచించారు. కోర్టుకు హాజరైనప్పుడల్లా కేసు ఫైళ్లను చదవాలని, సీనియర్ న్యాయవాదులు గైర్హాజరైనప్పుడు వారి కేసులను వాదించడానికి అవకాశాన్ని తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం సూచించింది.