న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్(CJI BR Gavai) తెలిపారు. ఇన్‌హౌజ్ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటీషన్‌పై విచారణలో పాల్గొనడం లేదని సీజేఐ గవాయ్ అన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికిన కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జస్టిస్ వర్మ కేసును అర్జెంట్‌గా విచారించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ కేసులో రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయని, వీలైనంత త్వరగా దీన్ని లిస్ట్ చేయాలని సిబల్ కోరారు. అయితే ఈ కేసులో తాను విచారణ చేపట్టలేనని, ఎందుకంటే తాను కూడా ఇన్‌హౌజ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని సీజేఐ గవాయ్ తెలిపారు.
సీజేఐగా సంజీవ్ ఖన్నా ఉన్న సమయంలో జస్టిస్ వర్మపై ఇన్‌హౌజ్ కమిటీ వేశారు. ఈ కేసును మరో బెంచ్‌కు అప్పగించనున్నట్లు సీజేఐ గవాయ్ తెలిపారు.