Punjab strike | పంజాబ్‌లో ప్రభుత్వం-అధికారుల మధ్య పోరు తీవ్రమైంది. ప్రభుత్వం విధానాన్ని నిరసిస్తూ పంజాబ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వీరికి రెవెన్యూ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరాలని సీఎం భతవంత్ సింగ్ మాన్ డెడ్‌లైన్‌ను ఉద్యోగులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంతకైనా పోరాడతామంటూ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లూథియానాలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి నరేందర్ సింగ్ ధలివాల్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పంజాబ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. అరెస్ట్ చేసిన ఉద్యోగిపై చర్యలు విరమించుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్‌కు తలొగ్గని సీఎం భగవంత్‌సింగ్ మాన్ మాత్రం సమ్మెకు దిగిన ఉద్యోగులపై కఠిన చర్యలకు దిగారు. ఈ తరహా నిరసనలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులను చర్చలకు పిలువకుండానే ఏకపక్షంగా సమ్మె చట్టవిరుద్ధమని పేర్కొన్న సీఎం మాన్.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా విధుల్లో చేరాలని హుకూం జారీ చేశారు.
అయితే, సీఎం చేసిన హెచ్చరికను ఉద్యోగులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. వీరంతా కూడా సామూహిక సాధారణ సెలవుపై వెళ్లారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులు లేకబోసిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో రెవెన్యూ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్ నెరవేరడానికి పంజాబ్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఐదు రోజులపాటు సామూహిక సెలవుల్లో వెళ్లాలని ఆదివారం నిర్ణయించారు. సీఎం విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. వీరిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ ఘర్షణతో ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.