Supreme Court | భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరులు తమ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ విలువలను అర్థం చేసుకొని స్వీయ నియంత్రణ, సంయమనం పాటించాలని సూచించింది. సోషల్ మీడియాలో పెరుగుతున్న విభజన ధోరణులను నియంత్రించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ‘తాము సెన్సార్షిప్ గురించి మాట్లాడటం లేదు. ప్రజలు తమంతట తామే బాధ్యత వహించాలి. తమ వ్యాఖ్యలతో సంయమనం పాటించాలి. సుప్రీంకోర్టు, రాష్ట్రం (ప్రభుత్వం) ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. అందువల్ల ప్రజలే స్వయంగా బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం.
సోషల్ మీడియా, సమాజంలో ఉద్రిక్తతలను వ్యాప్తి చేసే ఇతర వేదికలపై ఏమీ చెప్పొద్దు’ అని కోర్టు పేర్కొంది. పౌరుల్లో సోదరభావ స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. వేర్పాటువాద ఆలోచనలు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేటికాలంలో పౌరులు ఆలోచనాత్మకంగా మాట్లాడాలని సూచించింది. విచారణ సందర్భంగా.. సర్వోన్నత న్యాయస్థానం ‘మేం భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. కానీ, రాజ్యాంగంలో దానిపై ఇప్పటికే సహేతుకమైన పరిమితులు ఉన్నాయి. ప్రజలు ఈ పరిమితులను పాటించాలి’ అని చెప్పింది.
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే పోస్టుల పై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌కు సంబంధించిన కేసును విచారిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్లో భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాజంలో సామరస్యాన్ని కొనసాగించే ప్రవర్తనా నియమావళిని రూపొందించవచ్చా? అని కోర్టు పరిశీలిస్తోంది. సోషల్ మీడియాలో హిందూ దేవతలపై అభ్యంతరకరమైన పోస్టులను పోస్ట్ చేసినందుకు తనపై దాఖలైన అనేక ఎఫ్ఐఆర్ల నుంచి ఉపశమనం కోరుతూ వజాహత్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తున్నది.
ఇంతకు ముందు జూన్ 23న వజాహత్ ఖాన్‌కు అరెస్టు నుంచి కోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించింది. జులై 14 వరకు పొడిగించారు. తన పాత ట్వీట్ల కారణంగా అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో తనపై కేసులు నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనౌలిపై తాను గతంలో ఫిర్యాదు చేశానని.. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. వజాహత్ ఖాన్‌కు ఇచ్చిన అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనాన్ని తదుపరి విచారణ వరకు కోర్టు పొడిగించింది. అలాగే, స్వీయ నియంత్రణ, బాధ్యతతో పౌరులు భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలో అనే అంశంపై సహాయం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాదులను కోరింది.