Crime news : జైలు అంటే ఖైదీలకు కనీస వసతి సదుపాయాలు మినహా మరేమీ ఉండవు. కానీ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని శివమొగ్గ (Shivamogga) కేంద్ర కారాగారం (Centrel Jail) లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొందరు ఖైదీలు కావాలనుకుంటే లిక్కర్ (Liquor), సిగరెట్స్ (Cigaretts), డ్రగ్స్ (Drugs) అన్నీ వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. ఈ మధ్య కాలంలో జైల్లో ఖైదీలు పార్టీలు చేసుకున్న ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి.
ఈ క్రమంలో ఇవాళ ఓ ఆటోలో జైలుకు తీసుకొచ్చిన డ్రగ్స్, సిగరెట్స్‌ను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఉదయం ఓ వ్యక్తి ఆటోలో వచ్చి, జైలు క్యాంటీన్ కోసమని గేటు బయట ఐదు అరటిగెలలు దించి వెళ్లాడు. అయితే ఆ అరటిగెలల కాడలు తెరచినట్టుగా ఉండటంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాంతో గమ్ టేప్‌తో చుట్టిన సిగరెట్లు, మారిజువానా అనే మత్తుపదార్థం బయటపడ్డాయి.
ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అరటిగెలల్లో దొరికిన 123 గ్రాముల మారిజువానాను, డజన్ల సంఖ్యలోగల సిగరెట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు.