Contractor Suicide | బెంగళూరు, డిసెంబర్ 30: కర్ణాటకలో సంచలనం సృష్టించిన సివిల్ కాంట్రాక్టర్ సచిన్ పంచల్ ఆత్మహత్య కేసును సిద్ధరామయ్య సర్కార్ సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఆయన సన్నిహిత సహాయకుడు రాజు పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సచిన్ తన సూసైడ్ నోట్లో తన చావుకు రాజు కారణమని పేర్కొన్నారు.
రాజు రూ.1 కోటి ఇవ్వాలని తనను డిమాండ్ చేశారని ఆయన తన లేఖలో రాశారు. ‘ఈ కేసులో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గేపై బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ కేసును సీఐడీకి అప్పగించాం’ అని హోం మంత్రి పరమేశ్వర సోమవారం మీడియాకు వెల్లడించారు.
సచిన్ ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని.. నిజమేమిటో తెలుసుకోవడానికి విచారణ జరపాలని డిమాండ్ చేశానని ఖర్గే తెలిపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేకపోతే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించింది.