చెన్నై : తమిళ స్టంట్ కొరియోగ్రాఫర్ కణల్ కణ్ణన్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధ ఆలయం వెలుపల నెలకొల్పిన పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని హిందూ మున్నాని అధ్యక్షుడు కణల్ కణ్ణన్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పిలుపు ఇవ్వడం కలకలం రేపింది.
పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తంతి పెరియార్ ద్రవిడార్ కజగం కార్యకర్తల ఫిర్యాదు ఆధారంగా కణల్ కణ్ణన్‌ను అరెస్ట్ చేశారు. శ్రీరంగనాధ ఆలయంలో ప్రతిరోజూ దాదాపు లక్ష మంది హిందువులు పూజలు చేస్తారని, అటువంటి ప్రదేశంలో ఆలయం ఎదురుగా దేవుడు లేడని ఉద్ఘాటించే పెరియార్ విగ్రహం ఉందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ విగ్రహాన్ని బద్దలు కొట్టినప్పుడే హిందువులుగా మనం ఎదుగుతామని కణ్ణన్ వ్యాఖ్యానించారు. 2006లో హేతువాదిగా పేరొందిన ద్రవిడర్ కజగం వ్యవస్ధాపకుడు పెరియార్ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కణల్ కణ్ణన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్ధానం కొట్టివేయడంతో ఆయనను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కణ్ణన్ పలు తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశారు. పలు చిత్రాలలో అతిధి పాత్రల్లోనూ ఆయన కనిపించారు.