Z category Security : లోక్‌జన శక్తి పార్టీ (LJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలతో ‘జడ్’ కేటగిరి భద్రత (Z category Security) ను కల్పించింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10 నుంచి ఆయనకు ఈ భద్రత కల్పించినట్టు తెలిపింది. అయితే ఇందుకు కారణం ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు. చిరాగ్ పాశ్వాన్ (41) కు ఇంతకుముందు సాయుధ సరిహద్దు దళం భద్రత కల్పించేది. సెంట్రల్ పారామిలటరీ బలగాలకు చెందిన చిన్న టీమ్ ఆయన భద్రతను చూసుకునేది. కొత్తగా కేటాయించిన జడ్ కేటగిరి సెక్యూరిటీతో ఆయకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తుంది.
సుమారు 36 మంది పారామిలిటరీ కమెండోలు వివిధ షిఫ్టుల్లో పనిచేస్తారు. ఈ కమెండోలు రేయింబవళ్లు ఆయనకు భద్రత కల్పిస్తారు. 10 మంది కమెండోలను ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్న ప్రముఖుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు వీఐపీలు, కేంద్ర మంత్రులు ఉన్నారు.