న్యూఢిల్లీ, నవంబర్ 15: తన రాజకీయ జీవితం 2020లోనే ముగిసిపోయిందని కొందరు నేతలు పేర్కొన్నారని, అయితే తాను పోరాడి పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాల్లో పోటీ చేసి 19 దక్కించుకుని అనూహ్య విజయం సాధించిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు ‘2020లో మా పార్టీ ముగింపు దశకు వచ్చిందన్న పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. 2022 నాటికి ఎల్జేపీ (ఆర్వీ), నేను కూడా మా పరిస్థితి ముగిసిపోయిందనే నమ్మాం. అయితే మా నాన్నలాగే ఓటమిని అంగీకరించ లేకపోయా. అందుకే పార్టీ పునరుజ్జీవానికి పోరాటం చేసి దానికి ఉన్నతి కల్పించడానికి కృషి చేశా’ అని అన్నారు. అంతకు ముందు సీఎం నితీశ్‌ను కలిసిన ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.