న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ‘గల్వాన్ యుద్ధం’ ఆధారంగా సల్మాన్ ఖాన్ తీసిన బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంపై ‘చైనా గ్లోబల్’ విమర్శలు గుప్పించింది. ఈ చిత్రం నిజాలను పక్కన పెట్టి అతిశయోక్తులతో నింపేసిందని విమర్శించింది. వివిధ అంశాలలో ఉన్న తప్పులను కనుగొనడానికి ప్రయత్నించిన చైనా సామాజిక ఖాతాలను ఉటంకించింది. సినిమాటిక్ అతిశయోక్తులు చరిత్రను తిరిగి రాయలేవని, చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించాలన్న దృఢ సంకల్పాన్ని అవి కదలించలేవని ఒక నిపుణుడు పేర్కొన్నట్టు ఆ వార్తాపత్రిక పేర్కొంది. దీనిపై మన ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా స్పందించాయి. సినిమాలు అనేవి కళాత్మక వ్యక్తీకరణ చేసే సాధనాలని, భారత దేశం వాటిని నిషేధించడం కానీ, పరిమితులు విధించడం కానీ చేయదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.