న్యూఢిల్లీ: లఢక్‌లోని పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన చిత్రాలను ‘ఎన్డీటీవీ’ 2022 జనవరిలోనే ప్రచురించింది. 400 మీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల రాకపోకలు సాగుతున్నట్టు ఈ నెల 22న ఎన్డీటీవీకి అందిన కొత్త చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 1958 నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో నిర్మితమైన ఈ వంతెన.. లఢక్‌లో భారత్-చైనా మధ్య గల వాస్తవాధీన రేఖకు సమీపాన ఉన్నది. పాంగాంగ్ సరస్సు ఉత్తర-దక్షిణ ప్రాంతాల మధ్య వేగంగా రాకపోకలు సాగించేలా ఈ వంతెన చైనా బలగాలకు వీలుకల్పిస్తుంది. భారత్‌కు అభిముఖంగా చైనా బలగాలను నేరుగా, త్వరగా మోహరించేందుకు ఈ వంతెన దగ్గరి దారిలా ఉపకరిస్తుందని ఉపగ్రహ చిత్రాల నిపుణుడు, ఇంటెల్ ల్యాబ్ పరిశోధకుడు డామియన్ సైమన్ తెలిపారు.